ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను త్వరలో నేరుగా ఏటీఎం, యూపీఐల ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం రానుంది. అయితే ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోందని ఓ ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. దీని ద్వారా ఇకపై ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో కొంత భాగాన్ని స్తంభింపజేసి, మిగిలిన డబ్బును యూపీఐ, ఏటీఎం డెబిట్ కార్డులు మొదలైన వివిధ పద్ధతులు ఉపయోగించి విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారని ఆయన అన్నారు. అయితే ఈ వ్యవస్థను అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని, అందులో భాగంగా ప్రస్తుతం సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే, ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల పీఎఫ్ డబ్బులు పొందడానికి చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
ఆటో-సెటిల్మెంట్ మోడ్ కింద, దరఖాస్తు ఫారమ్ దాఖలు చేసిన 3 రోజుల్లో పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్‌ను ఎలక్ట్రానిక్‌గా పరిష్కరిస్తారు. కనుక మాన్యువల్ పనులు చేయాల్సిన పని తప్పుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆటో-సెటిల్మెంట్ మోడ్ పరిమితిని మంగళవారం రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల ఈపీఎఫ్ఓ చందదారులకు చాలా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విద్య, వివాహం, గృహ అవసరాలకు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కేవలం 3 రోజుల్లోగా తమ పీఎఫ్ డబ్బులు పొందగలుగుతారు.